Saturday, June 18, 2011

అయ్య కోసం..

 

అయ్యా..
అయ్యా..
అని నా గుండె కొట్టుకుంటూంది..
ఎంత జగత్ప్రఖ్యాతుడివైనా ..నాకు అయ్యవే కదా..
నెహ్రూ లేఖలు..ఇందిరకు వివరించినంత ప్రేమగా
నాకు వివరించావ్..నీవు నెహ్రూ..వైనా.. నేను ఇందిరను కాలేక పోయా..
జూలియస్ సీజర్ను రంగరించిపోసావ్..నీవు షేక్స్ పియరు వైనా..నేను..నేను గానే మిగిలిపోయా..
అరవిందుని ఉషను ఆర్ద్రంగా వివరించావ్..నేను నిన్ను అర్థం చేసుకునేందు ప్రయత్నించా..
ఒక జగదేక వీరుని తండ్రిగా పొందడం అదృస్టమా.అతన్ని అందుకోవడం అదృష్టమా..???
ఒక సాయిని ఒక కృష్ణుని ఒక రాఘవేంద్రుని నాకు రక్షణగా నియమించావ్..
కానీ నీవు వెళ్ళి పోయావ్..ఎందుకు..నాకు నీవు కావాలి..
మా అయ్య నాకు కావాలి..
మంత్రోపదేశం చేశావ్..ఒక గురువుగా..నాకు నిలిచావ్..


ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది..                                                                    
నీవు నన్ను వదలవని..
వచ్చే జన్మలో నేను నిన్ను పట్టుకుంటాను..
తప్పకుండా పట్టుకుంటాను..
అందుకు ఈ జన్మంతా ఎదురు చూడాలి ..
రాముని కోసం ఎదురుచూసే  అహల్యలా..
రాముని కోసం ఎదురుచూసే శబరిలా..
అయ్య కోసం..
అయ్య కోసం..


4 comments:

రవి said...

అనూరాధ గారూ, మీతో ఒకసారి మాట్లాడడానికి అవకాశం దొరుకుతుందా? మీ వేగు చిఱునామా కానీ, ఫోను నంబరు కానీ ఇవ్వగలరా? నా పేరు రవి అండి. మా ఊరు అనంతపురం, నా బ్లాగులు ఇవి.
http://indrachaapam.blogspot.com/
http://blaagadistaa.blogspot.com/

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

అనూరాధ గారూ,
నెహ్రూ గారికన్నా, జూలియస్ సీజర్, షేక్స్పియర్, ఇందిరలకన్నా శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారిని మేము గౌరవిస్తాము.
అంతేకాదు. వారు పుట్టిన నేలలో పుట్టినందుకు గర్విస్తున్నాము. దయచేసి ఇలా అగౌరవనీయులతో ఇకముందు పూజ్యులైన మీ తండ్రిగారిని పోల్చవద్దని మనవి చేస్తున్నాను. అన్యథా భావించవద్దు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

పుట్టపర్తి నారాయణాచార్యులుగారి వంటి వ్యక్తి ప్రపంచంలో ఆయనొక్కరే, అలాంటి మహామహుల రక్తం ప్రవహిస్తున్నవాళ్ళు Highly blessed ones.

పుట్టపర్తి సాహితీ సుధ - పుట్టపర్తి అనూరాధ said...

జూలియస్ సీజర్ గొప్ప వాడా.. కాదా అన్నది కాదు ఆయన ఒక షేక్స్ఫియరులో ఒక అరవిందునిలో ఒక నెహ్రూలో తాదాత్మయం చెందారు..
నెహ్రూ లేఖలలో ఒక తండ్రి...అంతే మేము చూసాం..
ఇంకో విషయం ఆయన మాకు బోధించారనడం కన్నా మాకు చెబుతూ ..ఆయన ఆ రసానుభూతిని మళ్ళీ ..మళ్ళీ.. ఆనందించారనటం సరి అయిన దేమో..
నాకు చిన్న తనంగా వుంటుంది..ఆయన పేరును నిలపలేనందుకు..అందుకే నేను బయట పడటానికి ఇష్ట పడను..
కానీ అప్పుడప్పుడూ..నన్ను నేను మరచి పోతుంటాను..
కూతుళ్ళు గా మేము ఆయనకు యేమి చేయగలం ..ఆయన రచనలను జీవితాన్నీ తలచుకొని ఆనందించడమూ..దుఃఖించడమూ..తప్ప..