Tuesday, April 26, 2011

kavitalu



  1. అక్షరాలు

తడబడుతూన్న..కలంలోంచీ..
ముడివడుతున్న..గళంలోంచీ..
సుడివడుతున్న..అశృకణంలోంచీ..
ధారలుగా..
ధారలౌ..రసాంబుధులుగా..
తరగలుగా..తరళములౌ..హిమలహరులుగా..
జాలువారేవి..ఈ అక్షరాలు..
కావు..కావివి..
ఎక్కడో..
వసంత సౌరభాలు నిర్గళితమైతే..
ఇక్కడ మధుకుల్యలపై..తేలునట్లు..
తత్తరపడు..వెర్రి మలయానిలాలు..
కావు..కావివి..
భీకరారుణిమలు..నిగిడారిన గగనార్ణవాన..
హర్ష ప్లావితమై ఎగిరే..
వెర్రి పారావతాలు..
నీ కొరకే ..నలిగిపోయి..
నీ కొరకే..చితికిపోయి..
అస్పష్ట జీవిత చిత్రాలుగా..మిగిలిన..
లలనల వ్యధా సందేశాలు ..
ఈ అక్షరాలు..
అతివలుగా..
కలపుంస్కోకిల..హేలాగతిగా..
కుహూకరించు..నవ్య వసంత యామినులు..
సబలలుగా..
ధరణీ మండలమామూలాగ్రమూ..
సుగంధిలమొనరించు..
ఆ గండూషిత విక్రమాలు..
ఆ ధిషణకు అబ్బురపడు..
ఏ వాచస్పతియైనా..
ఆ కరుణకు సాటిరాదు..
ఏ దీధితియైనా..
ఆ స్మితరేఖాబ్దుల చల్లదనాలకు..
ఆ కాంక్షారహిత హృదయోపహారములకు..
ముకురములై భాసించునవీ..
అక్షరాలు..
వీరు లేనిది..ప్రభవింపవు..
నీ తూర్పున..సుప్రభాతాలు..
వీరు లేనిది విరియబోవు..
నీ వసంతాన హిమస్నపిత సుమ నికుంజాలు..
పెంపారు మమతలను..
నిభృత దయాంతరంగిణియై..
కురిపించును మాతృమూర్తి నీ..అంతరంగాన..

చిరునవ్వుల..మువ్వలు సవ్వడించి..
మురిపించు..సోదరి నీ సన్నిధానాన..

లతాంత నీరజులెదను వుప్పొంగించి..
వాసంత సీమంతినియై శోభించు..
ప్రేయసి..నీ ప్రణయ బృందావనాన..

నీవు కన్ను తెరచినదిమొదలు..
వీచీ హస్తములెత్తి పర్వులిడు సాగరాలై..

నీపై రోచిస్సులు వర్షించే..
మమతానురాగాల మాలలు వీరు..
కానీ..
నీ..పురుషాహంకారపు అగ్నికీలల నడుమ..
నీచే కమ్మిన తమో జ్వాలల నడుమ..
నిరంతరం కుంగిపోయి..
తర తరాల ఇనుప పాదాల కింద..
అనుక్షణం నలిగిపోయి..

గహన కాననములెదలో అలముకొనగా..
అగ్ని మౌక్తికాలు నీకు కానుకలిస్తూ..
అశృగీత మాలికలను..మౌనంగా పలికించే..
వల్లకే యోషల అవ్యక్త స్వరాలు..
ఈ అక్షరాలు..
పాలవాగులెదలో వెల్లువైన పారవశ్యాన..
విధృతమైనవి కావీ..అశ్రు సరిత్తులు..

తీగలువారు వేదనల..
తుంపెసలాడు భావనలు..
తారసిల్లిన తరుణాన..
నిమీలితమైన నయనాల మాటున..
నిస్యందనమైన రసధారలు..
ఈ అక్షరాలు..
తలచవద్దు..ఇవి కేవలం..అక్షరాలని..

అవసరమైతే..విప్లవప్రళయాలను
భౄచలనసంకేతాలతోనే..సృష్టించగల..
విస్పులింగాలు..ఈ అక్షరాలు..

తలచవద్దు..ఇవి కేవలం వర్ణక్రమాలని..

అవసరమైతే..నీ చేతస్సున పరివృతమైన..
క్షుద్ర గర్వాన్ని..దావాగ్నిలా..
దహించివేయగల క్షోదక శక్తులు..

ఈ అక్షరాలు..



లేత చివురుల మేత మరిగీ..
పూల ఋతువుల నెయ్యమెరిగీ..
తలిరు తీవెల ఊయలల..
అల కొలువు తీరిన కోయిలా..

నా కాంతుడెటు తా దాగెనో..
ఓ తడవు రయమున చూడవే..

ఎద హత్తుకొను..
రంగేళి పాటల..


చిత్తమూరక.. కలచి పలుమరు..



తత్తరిల్లిన.. తలపు బరువులను..
ఎకసెక్కెములతో..తడిమి మురియక..

నా కాంతుడెతుతా దాగెనో..
ఓ తడవు రయమున చూడవే..

పొగిలి పోయెడి వేదనల..
పొంగారు జలధులు యెరుగవే..
మది బిచ్చతనమున..
చాల కోరితినీ..
సొంపైన బదులే..ఒసగవే..
సొంపైన బదులే..ఒసగవే..

నా కాంతుడెటు తా దాగెనో..
ఓ తడవు రయమున చూడవే..

ఉగాది సంగీత రూపకంగా ఆకాశవాణిలో ప్రసారం..




















తలిరాకుల..తలుపు తీసి..
పరవశాల రాశి పోసి..
తారుణ్యపు వేదనలను..
తీయ తీయగా పాడే..
ఎల మావుల రెమ్మలలో..
హోయలు చిలుకు కోయిలా..


పుష్ప శరుని జాడ యేదే..?
కందర్పుని జాడ యేదే..?

చిత్తములో నవ్య సుధలు..
కమ్మని తావులు విరియా..
తలపులలో తరళిత 
సౌదామినులే మెరయా..
విశ్వమంతా సౌందర్యపు..
చిత్తరువై నిలిచే..
విరహానలమున విరాళి 
మదనునికై..వేచే..

పుష్ప శరుని జాడ యేదే..?
కందర్పుని జాడ యేదే..?


పూదేనియలూరు విరులు 
విర విరలే పోయినవే..
చిగురాకుల రాచిలుకలు 
కల కలముల పిలచినవే..
విరిశరముల పులకింతకు 
కౌముదులే వేగినవే..
కన్నె కనుల మార్దవమై
 పుష్పశరుని రమ్మనవే..

పుష్పశరుని జాడ యేదే..?
కందర్పుని జాడ యేదే..?

పల్లకిలో ప్రచురితం..

ఉగాది సంగీత రూపకంగా ఆకాశవాణిలో ప్రసారం..








వసంతోదయము..

అదిగదిగో..
నవ వసంతోదయము..
అశమశరుని శృంగార విహారము..

మామిడి తోపుల గండుకోయిలలు..
పురివిప్పిన తలపుల మత్తిల్లినవే..
మత్తిలి మనసుల దహియించే..
విరహానల గీతములాలపించినవే..

అదిగదిగో.. నవ వసంతోదయము..
అశమశరుని శృంగార విహారము..

భ్రమర రాగమున పులకించినవటు..
మధు భారముతో.. మురియు కుసుమములు..
తెలి తెమ్మెర మైమరపు స్పర్శకే..
పులకించినవిటు విరి నికుంజములు..

అదిగదిగో.. నవ వసంతోదయము..
అశమశరుని శృంగార విహారము..

ప్రతి సుందర భావములో మనసిజు..
జాడలు ఉన్మీలితమైతే..
మధువాకలపై తేలు తెమ్మెరలు..
విరహుల ఎద రగిలింప చేసినవే..

అదిగదిగో నవ వసంతోదయము..
అశమశరుని శృంగార విహారము..

ఉగాది సంగీత రూపకంగా ఆకాశవాణిలో ప్రసారం..














పూలవలలు

హేలా రచితమైన ఆమనిలా..
ఆమె నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది..
పుష్పమాలానిచితమైన కలల శయ్యపై..
నిన్ను సేదతీర్చి సెలవివారగా నవ్వుతుంది..

ఆనందమనంగమై నీవు..
హర్షరాగాలు ఆలపిస్తావు..

అనుభూతి అభంగురమై..
అభినవ కాదంబరిని నిర్వచిస్తుంది..

చెలరేగిన ఆపూల తుఫానులో..
మత్తిల్లిన మధుపంలా నీవు తేలిపోతావు..

సాంభ్రాణి ధూప వాసనలు కదంబించిన కుంతలాల్లో..
కుసుమపేశలమై నీవు చిక్కుబడిపోతావు..

అప్పుడు..

నిస్పృహవై..

నిర్వీర్యానివై..

నిరాశలు వెదజల్లుకుంటూ వచ్చిన..
నిన్నటి నిశ్శబ్దపు దారులు..
నీకు గుర్తుకు రావు..

మళ్ళీ.. మళ్ళీ..పుట్టుకొచ్చే మొండి పొదల్లాంటి..,
కలలను తలవనైనా తలవకుండా..
మళ్ళీ..మళ్ళీ..పూర్ణకుంభాల్లా నిండుతున్న..
కళ్ళ తడిలో జారి పడిపోకుండా..
జాగ్రత్త పడిన ఆనడక తీరులు..
నీ స్మృతికి అందవు..

క్షామ రక్కసి పిడికిళ్ళలో..
దేశమే అట్టుడికి పోతూందో..

వ్యధా కులిత నినాదాల్లో..
కాలమే కాలిపొతోందో..

నీకు పట్టదు..

మరులు కమ్మిన వేడుకతో..
ఆ తరళ నయన పైనే చూపులు సారిస్తూ..
భవిష్యదభిముఖంగా సాగిపోతావు..
మధు కుల్యలపై మధుపంలా తేలిపోతావు..

నీ చూపు దేశాన్ని కాక..
ఆనందారామమైన అంతరంగాన్ని చూస్తుంది..

నీ పిలుపు భవితవ్యాన్ని తట్టి లేపక..
నిన్ను అల్లుకున్న చిన్నారులను..
ప్రేమతో పరామర్శిస్తుంది..

ఒక వేళ..

కిటికీ అవతలి ఆవేశంపై..
నీవు చూపు మోపబోయినా..
పూలవలలు పన్ని నిన్ను బంధిస్తుంది ఆమె..

చిన్నరిపాపల బోసినవ్వులకు..
నిన్ను నీవే అమ్ముకుంటావు..

కానీ..

ఎప్పటిలా వుండనికాలం..
నీ కను రెప్పలకింద చేరుకుంటుంది..
నీ వెంట్రుకల తెల్లదనంలో దాక్కుంటుంది..

అప్పుడు..

వద్దన్న వచ్చే వుదయాస్తమయాలు..
నిన్ను కలవరపెడతాయి..

అప్పుడప్పుడే..

అలరులు రాల్చుతూ..తలిరాకులను..
తొడుగుతున్న..యవ్వనంలో..
కట్న కానుకల సానువులపై నిలుచున్న..
వర రత్నాలను పొందలేక..
అలుపులేని కోర్కెలకు కళ్ళాలు వేయలేక..
ఏకాంత కుంత సంధ్యా కాంతల్లా నిలిచిన..
నీ ప్రేమఫలాల ఆక్రోశంలో..
నీ గుండె స్పందనను మరచిపోతుంది..

రెక్కలు రాని కూనలు..
హృదంతరాల సంతస కుసుమాలు కురిసే..
మంజుల మాసాలు మాకివ్వమని..
నీ వృధ్ధాప్యాన్ని ప్రశ్నిస్తే..

నీ కళ్ళు అశ్రుసరిత్తులే..వాలిపోతాయి..
నిన్నటి నీ తప్పును గుర్తు చేస్తాయి..


ఆంధ్రప్రభలో ప్రచురితం...













జీవితం




జీవితం ఉదయ సంధ్యల..

ప్రతిఫలనరాగం..

యవ్వనం..

పుష్పమధుపముల శృంగార సరళి..

వృధ్ధాప్యం..

జ్ఞాన చక్షువు చిత్రించిన..

ధ్యాన విగాహిత జ్యోత్స్నా విభావరి..

ఆంధ్రభూమిలో ప్రచురితం....























దేశమాత




దేశమాత..

పుణ్యచరిత..

నవ్యత నీ మనోజ్ఞత..

మనోహరము నీదు మమత..

నీవే మంగళ దేవత..


పూదేనెల పూజనీకు..

మనోరధము తీర్చు మాకు..

విభజింపని భారతమే..

యశస్కరము తల్లి మనకు..

ఎన్నో భాషలు,మతాలు..





























ఎన్నో సాంప్రదాయాలు..

కలబోసిన సంస్కృతి ఇది..
                                                                                                            
తల్లి భారతావని మది..


ఆకాశవాణిలో ఈమాసపుపాటగా..

















 మమతల లోతు

కళ్ళలోంచీ నీళ్ళొస్తున్నాయి..

బహుశా హృదయం ద్రవించిందేమో..

మనసులో జ్వాలలు రేగుతున్నాయి..

బహుశా ఆశలు మసకబారాయేమో..

గుర్తుంచుకోవడానికి నీవొక యవనికవా..?

జీవితాన్ని వెంటాడుతున్న మృత్యువువు కద..

ఊహించుకోవడానికి నీవొక యక్షప్రశ్నవా..?

వేకువను తరుముతున్న నిశీధివి కద..


వనితలో ప్రచురితం...














కాలం

మరు హజారమ్ములై..

పుప్పొడులు వెదజల్లు..

విరి పొదలలో గరిమలే..

యవ్వనాలై..

చలిత లతాంత కాంతులనుబోలు..

చందురుని వన్నెలే..

ఎలనవ్వులై..

సొలసి సోగలుబోయి..

సొంపిల్లు భావాలు..

సంఫుల్ల మానస విహాయసాలకు సంకేతాలై..

హొయలొలికి నిలిచింది కాలం..

సృస్టించింది మత్తైన మహేంద్రజాలం..


సమయంలో ప్రచురితం..






హిమబిందువు సోయగాలు..

హృదినంతా నింపుకున్న నేనెవరనుకున్నావు..?

వారుణీ తరుణి ఎదలోని..

మృదుమధుర విరాళిని నేను..

అభేద్యమైన పృకృతి అణువణువునూ..

మనోజ్ఞ భావ దర్పణాలుగా సృజియించే..

కవివరుని కన్నులలో విదృతమౌ..

శరదృతువును నేను..


ఆంధ్రభూమిలో ప్రచురితం..