ప్రేమ పురాణం......
ప్రేమనేది..అమృతమంటారుగానీయండీ..
ప్రేమలో పడ్డ వాళ్ళు కుడితిలో పడ్డ ఎలుకల్లా తన్నుకు చస్తారండీ..
అది సక్సెస్ అవుతే..అదృష్టవంతులే..
అది మాత్రం అషామాషీ వ్యవహారమనుకున్నారేంటీ..?
ఆ విరహాలూ..ఆ ఎదురుచూపులూ..
ఆ కోపాలూ.. ఆ తాపాలూ..
బాబోయ్..బాబోయ్..బాబోయ్..బోలెడు మలుపులున్నయ్.చూపులు కలసిన ప్రేమ మాటలు కలసి ఆపై మనసులు కలసి.. ఇప్పటి సినిమాల్లోలా..ఆపై తనువులు కూడా కలసి ఓ..వాన పాట..ఓ..పది లవ్ సీన్లు.. కానిచ్చి..'హమ్మయ్య...' అని వూపిరి పీల్చుకున్నరో లేదో అప్పుడే మా బాప్సో..లేకపోతే అంకులూ..బ్రదర్సో..ఎంటరైపోయి తమ విలనీని ప్రదర్శిస్తారు..
"హమ్మయ్య ప్రేమించావా..నీ కోసం వరుళ్ళను వెతికే శ్రమను తగ్గించావ్..అలాగే అతన్ని పెళ్ళి వరకూ లాక్కురా.."
పెళ్ళిళ్ళు కుదరటం ఆపై ఆకాశమంత పందిరీ, భూదేవంత పీటా వేసి పెళ్ళిళ్ళు చేయటమన్నది కలల్లోనో..కహానీల్లోనో మాటలయి కూచుంటున్నాయి గానీ, పై విధంగా అప్ప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేసే ఆదర్శ తలిదండ్రులూ వుంటారండోయ్..
"ఎందుకండీ..దిక్కుమాలిన కాన్వెంటు చదువులూ..వేలు వేలు డొనేషన్లూ..యూనివర్సిటీ డిగ్రీలూ..
వయసొచ్చిన ఆడపిల్లలకు ప్రేమించడం ఎలా..? అనే స్కూల్సు కానీ..ఆ ప్రేమని పెళ్ళి టర్నింగుకు తిప్పటమెలా..? అనే యూనివర్సిటీలుగానీ..వుంటే..చక్కగా..ఆ..ఆడపిల్లల తండ్రులకెంత ఓదార్పూ..అనే బ్రాడ్ మైండెడ్ ఫాదర్సూ.. ఎక్కువౌతున్నారీమధ్య..
లేకపోతే యేమిటి చెప్పండీ..పిల్ల ప్రేమించిందనగానే పక్కలో బాంబు పడ్డట్లు అదిరిపడి.. "చంపుతాను..నరుకుతాను..నన్ను నలుగురిలో తలెత్తుకొని తిరగనేయకుండా చేసావు..కదే..త్రాష్టురాలా..చూస్తాను..అతనితో నీ పెళ్ళి ఎలా అవుతుందో..చూస్తాను.. యిప్పుడే వెళ్ళి నిమ్మలూరు పిల్లాణ్ణి ఖాయం చేసుకు వస్తాను.."
అని తోక తెగిన కోతుల్లా ఎగిరిపడే కాలం పోయిందనడానికి నిదర్శనంగా ఎన్ని లవ్ మ్యారేజెస్ కళ్ళ బడటం లేదీమధ్యా..
ఇక వయసొచ్చిన కుర్రవాళ్ళూ..వాళ్ళను కన్నవాళ్ళూ..వూరుకుంటారా..చెప్పండీ..?
ఈమధ్య సినిమా వాళ్ళూ.. ఇబ్బడి ముబ్బడిగా..ప్రేమ టాపిక్ మేద సినిమాలు తీసేసి ప్రేమ విజయానికి యితోధికంగా కృషి చేస్తున్నారు.
"ప్రేమించుకుందాం రా..","పెళ్ళి చేసుకుందాం రా"పెళ్ళాడి చూపిస్తా.." అన్న తరహాలో. ఇక "ప్రేమించి..పెళ్ళాడి..పిల్లల్ని కని చూపిస్తా.." అన్న సినిమాలూ వస్తాయేమో కొంపదేసి.. విడ్డూరం కాకపోతే ప్రేమించటం పెళ్ళాట్టం పిల్లల్ని కనటం ఓ గొప్పేనా..
దేశానికి వుధ్ధారమయ్యేరీతిలో ఏదైనా సందేశాత్మకంగానో..వినోదాత్మకంగానో.. లేదా..ఇంకేదో ఆత్మకంగానో..సినిమాలుండాలిగానీ..ఇదేంటండీ..బాబూ..
ఓ పక్క దేశం జనాభా పెరిగిపోతొందో అనిన్నూ..
ఎయిడ్సు వ్యాధి ప్రబలిపోతోందనిన్నూ..అఘోరించి అల్లాడుతుంటే..పిల్లలు చదువుపై దృష్టి నిలపనేయకుండా ఈ సినిమాలేంటీ..?ఆ అర్ధనగ్న నృత్యాలేంటీ..?
ఇక రచయితలేం తక్కువ తినలేదండోయ్.. ప్రేమకు ముందూ..ఆ తర్వాతా పొందాల్సిన అనుభూతులూ..తమకాలూ..చక్కగా విశద పరిస్తే.. వాటిని శక్తి వంచన లేకుండా వళ్ళు దాచుకోకుండా రెచ్చిపోయి జీవం పోసి అయా పాత్రలకు న్యాయం చేసే నటే నటులూ..వీరంతా ప్రేమదేవతలంటే అపధ్ధమంటారా..?
ఇక పత్రికలు..
అబ్బో..వీటికథ చాలా వుంది..ఈ మధ్య A కథలూ..శృంగార కథలూ..అని ప్రత్యేకించి మరీ శృంగార రసాన్ని పోషించి జేబులు నింపుకునే పత్రికలు ఎక్కువయ్యాయంటే..అతిశయోక్తి ఏముందండీ..?
ఇదిగాక అనేక శృంగార సమస్యలమీద ఆరేళ్ళ పిల్లాడి దగ్గర్నుండీ..అరవైయ్యేళ్ళ వృధ్ధుడి వరకూ కలిగే సందేహాలకు వివరాతివివరంగా ఎంతో సహృదయంతో సమాధానాలిచ్చి వాళ్ళను స్వాంతన పరిచే శృంగార నిపుణులకు పత్రికల్లో పెద్ద పీటే వుందండోయ్..
వాటిని దొంగచాటుగా చదివి ప్రేమించుకుందాం రా..అని వీధుల వెంట వెర్రెత్తి పరిగెత్తే కుర్ర కారు గురించి యేం చెప్పమంటారూ..?
సాహితీ పిపాసులైన మరికొందరు ప్రేమ పిచ్చోళ్ళు మహనీయుల ప్రవచనాలను తలకెక్కించుకొని..
ప్రేమనేది.. ఒక మతం..
ఒక జీవితం..
ఒక యజ్ఞం..
అని చలంలా అనుకొని దాడీ పెంచేస్తే..కొందరు గుణకారులు..
ప్రేమ + ప్రేమ = ప్రేమ
ప్రేమ* ప్రేమ = ప్రేమ
ప్రేమ- ప్రేమ = ప్రేమ
ప్రేమ/ ప్రేమ = ప్రేమ
అనిన్నూ..
"సంతోషం..గుణకారం,దుఃఖం..భాగారం,స్నేహం..కూడిక,శత్రుత్వం..తీసివేత"
అనిన్నూ..దగ్గరితనాన్ని ప్రేమగా గుణించుకుని మురిసిపోతారు.
భగ్నప్రేమికులైతే..
జీవితాన్ని సిగరెట్తో పోల్చుకొని "ప్రేమ అనే నిప్పు సోకగానే పొగతో సాగి సాగి చివరకు బూడిదతో పూర్తవుతుంది..."
అని నిట్టూర్చి నీరవుతారు..పైగా మనసుకు చీవాట్లేస్తూ..
"మనసు గతి ఇంతే..మనిషి బ్రతుకంతే..
మనసున్న మనిషికీ..సుఖములేదంతే.."
అన్న ఆత్రేయ బాణీని గుర్తుచేసుకొంటారు.
ప్రేమ పెళ్ళి రంగు అద్దుకోగానే..అందులోని ప్రేమ ఆవిరై.. ప్రేయసిలోని రాక్షసి బయట పడ్డంతో..
"ట్రాజెడీలన్నీ మరణంతోనూ..కామెడీలన్నీ..పెళ్ళితోనూ..పూర్తవుతాయి ..రెంటికీ పెద్ద తేడా లేదు" అని విషాదించి..
"ప్రేయసీ నీ పేరు రాక్షసి" అని బావురుమంటారు..
విఫలప్రేమికులు మాత్రం..
"వస్తూ..వెళ్ళిపోతావనే..విషాదాన్ని తెస్తావు..పోతూ వెళ్ళిపోయావనే విషాదాన్ని మిగులుస్తావు.. ప్రేమా..నీవంతా విషాదమే..పాషాణమా.."
అని ప్రేమను నిష్టూరమాడి..
"రమ్మనిన తారాదు..
పొమ్మనిన తాపోదు..
వనిత తేయని చేదు..
ఓ కూనలమ్మా.."
అని కూనలమ్మకూ..ఓ కబురు చెవినేస్తారు..
కొందరు ప్రేమను స్పెషలైజ్ చేసినవారు..
"ప్రేమ ఇంద్రధనుస్సు అయితే..మొదటి ఆరు రంగులూ ఆకర్షణా..అవగాహనా..తాదాత్మ్యతా..స్పర్శా..కామం..కాగా, చివరిదీ ఏడోదీ ఓదార్పూనూ.." అంటూ..
"ఎవరి వలన నీ సుఖం రెట్టింపవుతుందో..ఎవరి వలన నీ దుఃఖం సగమవుతుందో అట్టివారి ఎడ నీకున్నది ప్రేమ.."అని ప్రేమకు ఓ డెఫనేషన్ను కూడా 'ఖూబ్ సూరత్' గా చేసిపారేసి ఓ బరువు దింపుకున్నారు..
ప్రేమను ప్రేమగా అనుభవించి అక్కడితో వదిలేసి ముందుకెళ్ళిపోయిన అవకాశవాదులనబడే "కపట ప్రేమికులు"..
"జీవితంలో చివరివరకూ తీసుకుపోలేని వానిని అందమైన మలుపు తిప్పి అక్కడే వదిలివేయాలి..నిజమే యే అనుభవాన్ని జీవితాంతం కోరుకోరాదు.. మనకు లభించిన అనుభూతిని గుండెపొరల్లో నిక్షిప్తం చేసుకోవాలంతే.."
అని తెలివిగా ప్రవచించి తమ "ప్యార్ కా నిషాన్" ను ప్రేయసి కడుపులో నిక్షిప్తం చేసి అందమైన మలుపులో అదృశ్యమైపోతారు.
"రెండు ఆత్మ వంచనలు కలిస్తే ప్రేమ" అని వంచించిన ప్రేయసిని తలచుకుని ఒకడు కుములుతే..
మహమ్మద్ మల్లిక్ అనే పెద్దమనిషి రాసిన దోహాలలోని ఆయన నాయిక
"కాగా కాగా..సబ్ తన్ ఖాయియో..
చున్ చున్ ఖాయియో మాస్..
దో నయ్ నా మత్ ఖయీ...
ఉస్మే పియా మిలన్ కి ఆశ్ హై.." అంటుంది..
"కాకీ..కాకీ..దేహమంతా తిను.. ఏరుకొని ఏరుకొని తిను..కానీ..రెండు కళ్ళు మాత్రం తినకు..వానిలో ప్రియుని కలిసే ఆశ మిగిలి వుంది.."
అని ఆశ చావక మొండిగా కాకిని వేడుకొంటుంది..
ఇలాంటి పేచీలన్నీ వుంటాయనే ఓ జాగ్రత్తపరుడు జాగ్రత్తగా..
"అనుభవించదలుచుకుంటే.. జీవితమంత గొప్పదీ..స్నేహం చేయ దలచుకొంటే ప్రకృతి అంత మంచిదీ వేరొకటి లేదు.."
అని ప్రకృతితో మాత్రం స్నేహం చేసి గుండె కాల్చుకోకుండా జాగ్రత్త పడ్డాడు..
"ఈ మనుషుల్ని ప్రేమించడం కన్నా.. ఊహాజనితమైన కల్పననీ,ప్రకృతినీ, ప్రాణం లేని వస్తువులనీ ప్రేమించటం నయం.."
అని ఊల్లేఖించాడు కూడా..
"దేవుని ముందు నిశ్శబ్ద ధ్యానంలో కూడా అతడు నీ జ్ఞాపకాలలో నిలచి వుండాలట.. అదేనట ప్రేమంటే.."
అంటూ ఓ భక్తుడు భగవంతుని ఎడ తన డీప్ లవ్ ఎక్స్ ప్లైన్ చేసి భక్తిని నిరూపించుకున్నాడు.
ఓ నాస్తికుని.. కాదు..కాదు.. నాస్తిక ప్రేమ భక్తుని చూద్దాం రండి..యితనేమంటాడంటే..
"మమతలన్నీ మానుకుని ముక్తి మార్గం వెతకను నాస్తికుణ్ణయితే అయ్యాను గాక..స్వర్గం కోసం దేవులాడను.. ప్రవాసమది.. ఏముందక్కడ..?
చిన్నబిడ్డ నవ్వుతో .. పులకరిస్తుందా..?"
అని ముక్తి మార్గాన్ని డోంట్ కేర్ చేసి..
ప్రియురాలి నూపురాల సంగీతం.. ఏ వైకుంఠంలో వుంది..?
ప్రేయసి చందమామ లాంటి అందం కంటే గొప్పదా..అక్కడి ఊర్వశి రూపం..?
అంటూ.. రంభా ఊర్వశులనే ఏకి పారేశాడు 'ఒడియా'లో..
"ప్రియా..రూపశశీ..
సేకే ఊర్బశీ..
పారే జిణి గరబిణీ.."
ఇది "సబూజ కవిత"లో 'మాకుళకావ్య గుచ్చం'లో 'పూరీ మందిర ' అనే పదమూడు ఖండికల విలక్షణ కవిత ఇది..
"ఒక తీయని కలగా ఊహలు నిజమైననాడు బ్రతుకులో అర్థాలు తెలుస్తాయి."అని ప్రేమ పండిన ఈ పెద్దమనిషి కమ్మగా చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమ పురాణం మహా దొడ్డది.పేజీలు పెరగటం..గుండే బరువెక్కడం తప్ప అంతం అంతూ లేదు కదా..
ఏది ఏమైనా..
"ప్రేమ ఒక అందమైన కల"
అనుకోవాలంతే...........!!!
ఉదయంలో ప్రచురితం...
No comments:
Post a Comment