- అక్షరాలు
తడబడుతూన్న..కలంలోంచీ..
ముడివడుతున్న..గళంలోంచీ..
సుడివడుతున్న..అశృకణంలోంచీ..
ధారలుగా..
ధారలౌ..రసాంబుధులుగా..
తరగలుగా..తరళములౌ..హిమలహరులుగా..
జాలువారేవి..ఈ అక్షరాలు..
కావు..కావివి..
ఎక్కడో..
వసంత సౌరభాలు నిర్గళితమైతే..
ఇక్కడ మధుకుల్యలపై..తేలునట్లు..
తత్తరపడు..వెర్రి మలయానిలాలు..
కావు..కావివి..
భీకరారుణిమలు..నిగిడారిన గగనార్ణవాన..
హర్ష ప్లావితమై ఎగిరే..
వెర్రి పారావతాలు..
నీ కొరకే ..నలిగిపోయి..
నీ కొరకే..చితికిపోయి..
అస్పష్ట జీవిత చిత్రాలుగా..మిగిలిన..
లలనల వ్యధా సందేశాలు ..
ఈ అక్షరాలు..
అతివలుగా..
కలపుంస్కోకిల..హేలాగతిగా..
కుహూకరించు..నవ్య వసంత యామినులు..
సబలలుగా..
ధరణీ మండలమామూలాగ్రమూ..
సుగంధిలమొనరించు..
ఆ గండూషిత విక్రమాలు..
ఆ ధిషణకు అబ్బురపడు..
ఏ వాచస్పతియైనా..
ఆ కరుణకు సాటిరాదు..
ఏ దీధితియైనా..
ఆ స్మితరేఖాబ్దుల చల్లదనాలకు..
ఆ కాంక్షారహిత హృదయోపహారములకు..
ముకురములై భాసించునవీ..
అక్షరాలు..
వీరు లేనిది..ప్రభవింపవు..
నీ తూర్పున..సుప్రభాతాలు..
వీరు లేనిది విరియబోవు..
నీ వసంతాన హిమస్నపిత సుమ నికుంజాలు..
పెంపారు మమతలను..
నిభృత దయాంతరంగిణియై..
కురిపించును మాతృమూర్తి నీ..అంతరంగాన..
చిరునవ్వుల..మువ్వలు సవ్వడించి..
మురిపించు..సోదరి నీ సన్నిధానాన..
లతాంత నీరజులెదను వుప్పొంగించి..
వాసంత సీమంతినియై శోభించు..
ప్రేయసి..నీ ప్రణయ బృందావనాన..
నీవు కన్ను తెరచినదిమొదలు..
వీచీ హస్తములెత్తి పర్వులిడు సాగరాలై..
నీపై రోచిస్సులు వర్షించే..
మమతానురాగాల మాలలు వీరు..
కానీ..
నీ..పురుషాహంకారపు అగ్నికీలల నడుమ..
నీచే కమ్మిన తమో జ్వాలల నడుమ..
నిరంతరం కుంగిపోయి..
తర తరాల ఇనుప పాదాల కింద..
అనుక్షణం నలిగిపోయి..
గహన కాననములెదలో అలముకొనగా..
అగ్ని మౌక్తికాలు నీకు కానుకలిస్తూ..
అశృగీత మాలికలను..మౌనంగా పలికించే..
వల్లకే యోషల అవ్యక్త స్వరాలు..
ఈ అక్షరాలు..
పాలవాగులెదలో వెల్లువైన పారవశ్యాన..
విధృతమైనవి కావీ..అశ్రు సరిత్తులు..
తీగలువారు వేదనల..
తుంపెసలాడు భావనలు..
తారసిల్లిన తరుణాన..
నిమీలితమైన నయనాల మాటున..
నిస్యందనమైన రసధారలు..
ఈ అక్షరాలు..
తలచవద్దు..ఇవి కేవలం..అక్షరాలని..
అవసరమైతే..విప్లవప్రళయాలను
భౄచలనసంకేతాలతోనే..సృష్టించగల..
విస్పులింగాలు..ఈ అక్షరాలు..
తలచవద్దు..ఇవి కేవలం వర్ణక్రమాలని..
అవసరమైతే..నీ చేతస్సున పరివృతమైన..
క్షుద్ర గర్వాన్ని..దావాగ్నిలా..
దహించివేయగల క్షోదక శక్తులు..
ఈ అక్షరాలు..
No comments:
Post a Comment