Monday, June 13, 2011

జీవితం



జీవితం




జీవితం ఉదయ సంధ్యల..

ప్రతిఫలనరాగం..

యవ్వనం..

పుష్పమధుపముల శృంగార సరళి..

వృధ్ధాప్యం..

జ్ఞాన చక్షువు చిత్రించిన..

ధ్యాన విగాహిత జ్యోత్స్నా విభావరి..

ఆంధ్రభూమిలో ప్రచురితం....

Friday, June 10, 2011

పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం: పూలవలలు...  హేలా రచితమైన ఆమనిలా..ఆమె నీ జీవితంల...

పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం: పూలవలలు... హేలా రచితమైన ఆమనిలా..ఆమె నీ జీవితంల...: "పూలవలలు... హేలా రచితమైన ఆమనిలా.. ఆమె నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది.. పుష్పమాలానిచితమైన కలల శయ్యపై.. నిన్ను సేదతీర్చి సెలవివారగా నవ్వుతుం..."

పూలవలలు...
 
హేలా రచితమైన ఆమనిలా..
ఆమె నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది..
పుష్పమాలానిచితమైన కలల శయ్యపై..
నిన్ను సేదతీర్చి సెలవివారగా నవ్వుతుంది..

ఆనందమనంగమై నీవు..
హర్షరాగాలు ఆలపిస్తావు..
అనుభూతి అభంగురమై..
అభినవ కాదంబరిని నిర్వచిస్తుంది..
చెలరేగిన ఆపూల తుఫానులో..
మత్తిల్లిన మధుపంలా నీవు తేలిపోతావు..
సాంభ్రాణి ధూప వాసనలు కదంబించిన కుంతలాల్లో..
కుసుమపేశలమై నీవు చిక్కుబడిపోతావు..
అప్పుడు..
నిస్పృహవై..
నిర్వీర్యానివై..
నిరాశలు వెదజల్లుకుంటూ వచ్చిన..
నిన్నటి నిశ్శబ్దపు దారులు..
నీకు గుర్తుకు రావు..
మళ్ళీ.. మళ్ళీ..పుట్టుకొచ్చే మొండి పొదల్లాంటి..,
కలలను తలవనైనా తలవకుండా..
మళ్ళీ..మళ్ళీ..పూర్ణకుంభాల్లా నిండుతున్న..
కళ్ళ తడిలో జారి పడిపోకుండా..
జాగ్రత్త పడిన ఆనడక తీరులు..
నీ స్మృతికి అందవు..
క్షామ రక్కసి పిడికిళ్ళలో..
దేశమే అట్టుడికి పోతూందో..
వ్యధా కులిత నినాదాల్లో..
కాలమే కాలిపొతోందో..
నీకు పట్టదు..
మరులు కమ్మిన వేడుకతో..
ఆ తరళ నయన పైనే చూపులు సారిస్తూ..
భవిష్యదభిముఖంగా సాగిపోతావు..
మధు కుల్యలపై మధుపంలా తేలిపోతావు..
నీ చూపు దేశాన్ని కాక..
ఆనందారామమైన అంతరంగాన్ని చూస్తుంది..
నీ పిలుపు భవితవ్యాన్ని తట్టి లేపక..
నిన్ను అల్లుకున్న చిన్నారులను..
ప్రేమతో పరామర్శిస్తుంది..
ఒక వేళ..
కిటికీ అవతలి ఆవేశంపై..
నీవు చూపు మోపబోయినా..
పూలవలలు పన్ని నిన్ను బంధిస్తుంది ఆమె..
చిన్నరిపాపల బోసినవ్వులకు..
నిన్ను నీవే అమ్ముకుంటావు..
కానీ..
ఎప్పటిలా వుండనికాలం..
నీ కను రెప్పలకింద చేరుకుంటుంది..
నీ వెంట్రుకల తెల్లదనంలో దాక్కుంటుంది..
అప్పుడు..
వద్దన్న వచ్చే వుదయాస్తమయాలు..
నిన్ను కలవరపెడతాయి..
అప్పుడప్పుడే..
అలరులు రాల్చుతూ..తలిరాకులను..
తొడుగుతున్న..యవ్వనంలో..
కట్న కానుకల సానువులపై నిలుచున్న..
వర రత్నాలను పొందలేక..
అలుపులేని కోర్కెలకు కళ్ళాలు వేయలేక..
ఏకాంత కుంత సంధ్యా కాంతల్లా నిలిచిన..
నీ ప్రేమఫలాల ఆక్రోశంలో..
నీ గుండె స్పందనను మరచిపోతుంది..
రెక్కలు రాని కూనలు..
హృదంతరాల సంతస కుసుమాలు కురిసే..
మంజుల మాసాలు మాకివ్వమని..
నీ వృధ్ధాప్యాన్ని ప్రశ్నిస్తే..
నీ కళ్ళు అశ్రుసరిత్తులే..వాలిపోతాయి..
నిన్నటి నీ తప్పును గుర్తు చేస్తాయి..

ఆంధ్రప్రభలో ప్రచురితం   




              

Sunday, June 5, 2011

కిల ..కిల..కిల..కిల.

అమ్మా ..నాకో ..కల వచ్చింది..
చెప్పు నాన్నా..
పరీక్ష ఎనిమిదికంట..నేను ఎనిమిదికే లేచానంట..టైమైపోయిందని పరీక్ష హాలుకు పరిగెత్తానంటా..
ఊ..
నీ పరీక్ష ఇక్కడ కాదూ ఇంకో సెంటరులో అన్నారంటమ్మా..
అవునా..
పరిగెత్తి..పరిగెత్తి..ఆ సెంటరుకు చేరుకుంటున్నానంట..కానీ ..టైమైపోయిందంట..
కాదు నాన్నా..నీవు పరీక్ష లకు చదువుతున్నావు కదా.. అందుకని నీ ఆలో చనలన్నీ పరీక్ష మీదే వుంటాయి కదా..అందుకే అలాంటి కలలు వస్తాయి ..భయపడకు..వెళ్ళి చదువుకో పో..
అమ్మా..నాకు ఇంకో కల వచ్చింది..
ఏంటో చెప్పు..
నా పక్కోడు పరీక్ష బాగా రాస్తున్నాడంట..నేను..వాడి దాన్లో చూసి బాగా కాపీ కొడుతున్నానంట..
............???????

Wednesday, June 1, 2011

పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం: పొగ తాగిన వాడు క్యాన్సర్ కొడుకై పుట్టున్...

పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం: పొగ తాగిన వాడు క్యాన్సర్ కొడుకై పుట్టున్...: "ఈ రోజు పొగాకు దినమంట..అంటే పొగ తాగమని కాదు తాగితే సస్తార్రా..నాయాళ్ళలారా..అని ..అర్థమంట..మరి దాని అమ్మడమెందుకో ..మళ్ళీ దానిపై పుర్రె బొమ్మ..."

పొగ తాగిన వాడు క్యాన్సర్ కొడుకై పుట్టున్...



ఈ రోజు పొగాకు దినమంట..అంటే పొగ తాగమని కాదు తాగితే సస్తార్రా..నాయాళ్ళలారా..అని ..అర్థమంట..మరి దాని అమ్మడమెందుకో ..మళ్ళీ దానిపై పుర్రె బొమ్మ ముద్రించటమెందుకో..
ఈ యాంటీ పొగాకు దినమెందుకో.. పొగ తాగి వాళ్ళ ఆరోగ్యంతో పాటూ పరిసరాలనూ పాడుచేసున్న వాళ్ళను..నాలుగు తన్ని బొక్క లోకి తోస్తే ఎట్టా వుంటుందంటా..
అమ్మో..వద్దు ..వద్దు.. ముందు మా ఆయన్నే ఎర్ర టోపీలోళ్ళు ..పట్టుకు పోతారు..
ఇదిగో అందరూ ఇనండీ..పొగ కొద్దిగా తాగండి..మెల్లిగా పొగ ఉఫూ..ఉఫూ..అని వదలండి..పక్కోళ్ళకు రానీకుండా..
పెట్టె పైన పుర్రె బొమ్మ ఎక్కువగా సూడమాకండి..గుండె తరుక్కు పోతాది..సరేనా..

Sunday, May 29, 2011

నా యోగం ..హఠ యోగం..


త్వరగా ఆఫీసు నుంచీ ..ఇంటికెళ్ళి..అర్జంటుగా యోగాసనాలూ..ప్రాణాయామం..ఇంకా..ధ్యానం చేసేయాలి..
ఇంటికొచ్చాను..అలవాటుగా .. పనిమనిషి డుమ్మా..చేసేదేముంది..ఆ నాలుగూ కానిచ్చేసి..
ఆదరా..బాదరా..స్నానాలు కానిచ్చేసి..యోగాకు రెఢీ..అయిపోయాను..
మొదటగా..ఆసనాలు..వజ్రాసనం..ఆ ఆసనం ..ఈ ఆసనం..
నీవు నీళ్ళు బాటిల్స్ లో నింపు..
నీవే నింపు..
ఎందుకమ్మా..అన్ని కష్టమైన పనులు నాకిచ్చి ఈజీ పనులు నీవు చేస్తావా..నేనే బాటిల్స్ నింపుతా.. నీవు..బట్టలారేయ్..
చూడమ్మా..నేను చిన్న పిల్లని..
అబ్బ చా..
ఈ రోజు పనిమనిషి రాలేదు..సిరీ నీవు ఇల్లు చిమ్ము వాడు ఆ కట్టె తో ఇల్లు తుడుస్తాడు..నేను యోగం మధ్యలోనుంచీ అరిచాను..
ఆ..చూడు ..నేను ఇల్లు చిమ్మాలి..బాటిల్స్ నింపాలి ..బట్టలారేయటంలో సహాయం చేయాలి..
వాడు మాత్రం..తుడవటమొక్కటే..నేనస్సలు చెయ్యను..
వాణ్ణి..ఇల్లు చిమ్మమను..
వాడు మగపిల్లవాడు..వాడికి రాదు..నీవే చిమ్ము..
మళ్ళే నేను యోగం మధ్యలోనించీ గావు కేక పెట్టాను..
ఆ చూశావా నాన్నా..వాడు మగ పిల్లాడు..
నేను నిదానంగా ఊపిరి తీస్తున్నాను..వదులుతున్నాను..
అది ఊడవటం మొదలు పెట్టింది..
ఇంతలో ఆయన రంగప్రవేశం చేసినట్లున్నారు..
అక్కడ దుమ్ము పోలేదు..
నీవు ఓవర్ చేయకు నాన్నా..
ఏయ్..ఇక్కడ చూడవే..ఈ మూలకు..
అమ్మా.. అది కీచుమని అరిచింది..ముందు నాన్నను ఇక్కణ్ణుంచీ పొమ్మను..అప్పుడేఅ ఊడుస్తా..
నా ముందుకొచ్చి నిలబడింది..
నేను కళ్ళు తెరవక తప్పలేదు..దాని పని అది చేస్తుంటే మీరెందుకు..
మధ్యలో ..అరవక తప్పలేదు మళ్ళీ..

అది మళ్ళీ వెళ్ళింది..ఊడవడానికి..
ఇక్కడివ్వవే..కిచనులో ఇంత చెత్త పెట్టుకొని వదిలేసింది..ఆయన చీపురు లాక్కొని కిచనులోని చెత్తను లాక్కొచ్చారు..
కిచనులో తడిగా లేదా నాన్నా..చీపురు పాడై పోదా..
వాడు క్యారెట్ తింటూ చోద్యం చూస్తున్నాడు..ఆనందంగా..
పూరకం..రేచకం..కుంభకం..శూన్యకం..
పూరకం...రేచకం....కుంభకం..శూన్యకం...
ఇంక నీవు వెళ్ళి తుడువు..
వెళతాలే..నీవెందుకూ ..చెప్పేది..అమ్మా..దాన్ని ఊరికే ఉండమను..
నేను చిన్ముద్ర..చిన్మయ ముద్ర..ఆది ముద్ర..
ఇక..ధ్యానం..
ఊపిరి పైనే..ధ్యానం..మెల్లిగా..ఊపిరి పీల్చూ..వదులూ..పీల్చూ..వదులూ..
నెమ్మదిగా..నెమ్మదిగా..తలంతా మైకం కమ్మినట్లవుతూంది..
కళ్ళు తెరవాలన్నా..తెరవలేక పోతున్నాను..
మత్తుగా..హాయిగా....ఆనందంగా..సుఖంగా..
ఇదే..ధ్యానమా..ఇలా చేస్తే..అన్ని వ్యాధులూ..పోతాయా..అప్పుడప్పుడూ..ఆలోచనలు..అలల్లా వస్తున్నాయి..వెళుతున్నాయి..
వస్తున్నాయి..వెళుతున్నాయి..
ఇలా గంటసేపైనా..ఉం..డ..వ.......చ్చు.............క.........దా.............
అమ్మా........................
బలవంతంగా..కనులను తెరవాల్సి వచ్చింది..
ఎందుకంటే..
నాచిన్న కొడుకు..ఇల్లంతా..నీటి మయం చేశాడు..కాబట్టి..
ఒక పక్క తడి మరో పక్క పొడి..
అఘాయిత్యంగా తన పని కానిచ్చి..ఉక్రోషంగా..చూస్తున్నాడు..టి.వి...
ఏం..పనిరా..ఇది..
ఈ పనులు ఆయనో ..నేనో ..చేసుకొనే..వాళ్ళం..
కానీ పిల్లలకు ...పని అలవాటు కావాలని..ఇదిగో ఇలా..



Saturday, May 28, 2011

వినాయకా..నిను..వినా..బ్రోచుటకు..




ఎన్నియల్లో..యెన్నియల్లో..
యినాకమయ్యకు ..పూజంట..గుళ్ళో..

రారే..రారే...ఓ..రాములమ్మా..
చూదాము రారే..ఓ ..లచ్చుమమ్మా..

పత్తిరి పూజలు లడ్డు నైవేద్యాలు..
పాటలు..పరవళ్ళు..ఆటలు..సందళ్ళు..
సరదాల తిరునాళ్ళు..కులికేటి పెరుమాళ్ళు..
కైలాసగిరి రాద.. సక్కంగ శివునెనక..

రారే..రారే..ఓ..రాములమ్మ..
పోదాము రారే..ఓ..లచ్చుమమ్మా..

బాంచనయ్యసామి కాల్మొక్త..నీకు..
బతుకు సల్లగ బోవ వరమీయినాకు..
సక్కన్ని పిల్లొల్లు..సదువుల్లు కొలువుల్లు..
సుకమైన పాణాలు ..మాకియ్యి దేవా..

అడుగే..అడుగే..ఓ రాములమ్మా..
పెట్టండే దండాలు..ఓ ..లచ్చుమమ్మా..


***
ఎన్ని పేర్లు..ఎన్ని రూపులూ..
నీవు అందరికీ ..ప్రియ దేవుడవూ..
బాల గణపతీ..మా వీర గణపతీ..
విఘ్న గపతీ.. మా లక్ష్మీ గణపతీ..
రావణుడూ..తపసుజేసి..
శంకరుణ్ణి మెప్పించీ..
పొందాడు..ఒకనాడు ఆత్మ లింగాన్ని..
బాల వటునివై.. వెళ్ళి..
రావనుణ్ణి మాయ జేసి..
భూస్థాపిత మొనరించావూ..
నీవు బుధ్ధిశాలి వనిపించావూ..

షణ్ముఖుడూ..నెమలినెక్కి...
ముమ్మారూ భూమిచుట్టి..                             
ఓడించా యత్నించాడూ..
నిన్నూ తక్కువగా..భావించాడూ..
మాతా పితరుల సేవే..
సర్వ తీర్థ పవిత్రతనీ..
గౌరీ శివులను చుట్టావూ..
నీవూ తమ్ముణ్ణీ ఓడించావూ..

చందురుడూ నిన్ను చూసి..                 
ఎకసెక్కెంగా నవ్వా..
ముక్కోపివి నీవయ్యావూ..
వాణ్ణి శాపంతో ..దండించావూ..
లంబోదరుదైతెమీ..వాహనమెలుకైతేమీ..
అండా..దండగ నీవుండా..మాకూ..
కొరతెందుకు ఇక దండగా..
***                     



                 బాల గణపతి నీకు కోటి దండాలు..                   
బొండుమల్లెలు తీర్చు నీకు.. మురిపాలు..

బొజ్జ దేవరవయ్యి ..కజ్జికాయలు మెక్కి..
బుజ్జగాలకు లొంగి.. వరములిచ్చేవూ..



ఆది దైవమ్మయ్యి..విఘ్నాలు వారించి..
ఎల్లరకు శుభములూ.. కలుగ జేసేవూ..

పత్రి పూజలతోనె.. సంతుష్టి నందేవు..
షణ్ముఖునితో కూడి..ఆటలాడేవు..
ఉరగ యజ్ఞోపవీతాన్ని..మోజుగా వేసేవు..
చిట్టెలుక స్వారీన లోకాలు చుట్టేవు..

విజ్ఞాన ఖనివయ్యి ..ఖ్యాతినార్జించేవు..
సిధ్ధి బుధ్ధిని కూడి..మురిపాల తేలేవు..
ప్రమధ గణ ప్రభృతులకు..అధినేత వయ్యేవు..
ప్రథనొంది ప్రభ చింది..ప్రియ వాది వయ్యేవు..

***

జై జై జై జై గణేశ..జై జై జై జై..                
జై జై జై జై గణాధిపా..జై జై జై..

జై జై జై జై గణపతి దేవా..                                      
మొరవిని నేవే .. వరమీయ రావా..
నమ్మితి నిన్నే.. చూపుము తోవ..
ఉండ్రాళ్ళివిగో ..దీవించవయ్యా..


కలియుగ మిది స్వామి బ్రతుకు దుర్లభం..
అడుగు అడుగునా అవరోధమధికం..
మనిషి మనిషిలో పెరిగెను స్వార్థం..
మనసు మనసునా మలినం సత్యం..


చిందర వందర ..ముందరి బ్రతుకూ..
ఎదుగూ బొదుగూ..లేనిది తెరువూ..
చిరిగిన నోట్లై..ఆశలు నలుగూ..
ఒలికిన పాలై..ఊహలు కుములూ..
జై జై జై జై..గణేశ..జై జై జై జై 
జై జై జై జై గణాధిపా జై జై జై జై..


అకాశవాణిలో సంగీతరూపకంగా..



Wednesday, May 25, 2011


పరుగు ..పరుగు.. పరుగు..
ఇది అలుపెరుగని పరుగు..
పుట్టినప్పటి నుండీ..
ఇది..బతుకు..ఉరుకులాట..
చావు రేవు దాక.. దీని తీట తీరదంట..