హేలా రచితమైన ఆమనిలా..
ఆమె నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది..
పుష్పమాలానిచితమైన కలల శయ్యపై..
నిన్ను సేదతీర్చి సెలవివారగా నవ్వుతుంది..
ఆనందమనంగమై నీవు..
హర్షరాగాలు ఆలపిస్తావు..
అనుభూతి అభంగురమై..
అభినవ కాదంబరిని నిర్వచిస్తుంది..
చెలరేగిన ఆపూల తుఫానులో..
మత్తిల్లిన మధుపంలా నీవు తేలిపోతావు..
సాంభ్రాణి ధూప వాసనలు కదంబించిన కుంతలాల్లో..
కుసుమపేశలమై నీవు చిక్కుబడిపోతావు..
అప్పుడు..
నిస్పృహవై..
నిర్వీర్యానివై..
నిరాశలు వెదజల్లుకుంటూ వచ్చిన..
నిన్నటి నిశ్శబ్దపు దారులు..
నీకు గుర్తుకు రావు..
మళ్ళీ.. మళ్ళీ..పుట్టుకొచ్చే మొండి పొదల్లాంటి..,
కలలను తలవనైనా తలవకుండా..
మళ్ళీ..మళ్ళీ..పూర్ణకుంభాల్లా నిండుతున్న..
కళ్ళ తడిలో జారి పడిపోకుండా..
జాగ్రత్త పడిన ఆనడక తీరులు..
నీ స్మృతికి అందవు..
క్షామ రక్కసి పిడికిళ్ళలో..
దేశమే అట్టుడికి పోతూందో..
వ్యధా కులిత నినాదాల్లో..
కాలమే కాలిపొతోందో..
నీకు పట్టదు..
మరులు కమ్మిన వేడుకతో..
ఆ తరళ నయన పైనే చూపులు సారిస్తూ..
భవిష్యదభిముఖంగా సాగిపోతావు..
మధు కుల్యలపై మధుపంలా తేలిపోతావు..
నీ చూపు దేశాన్ని కాక..
ఆనందారామమైన అంతరంగాన్ని చూస్తుంది..
నీ పిలుపు భవితవ్యాన్ని తట్టి లేపక..
నిన్ను అల్లుకున్న చిన్నారులను..
ప్రేమతో పరామర్శిస్తుంది..
ఒక వేళ..
కిటికీ అవతలి ఆవేశంపై..
నీవు చూపు మోపబోయినా..
పూలవలలు పన్ని నిన్ను బంధిస్తుంది ఆమె..
చిన్నరిపాపల బోసినవ్వులకు..
నిన్ను నీవే అమ్ముకుంటావు..
కానీ..
ఎప్పటిలా వుండనికాలం..
నీ కను రెప్పలకింద చేరుకుంటుంది..
నీ వెంట్రుకల తెల్లదనంలో దాక్కుంటుంది..
అప్పుడు..
వద్దన్న వచ్చే వుదయాస్తమయాలు..
నిన్ను కలవరపెడతాయి..
అప్పుడప్పుడే..
అలరులు రాల్చుతూ..తలిరాకులను..
తొడుగుతున్న..యవ్వనంలో..
కట్న కానుకల సానువులపై నిలుచున్న..
వర రత్నాలను పొందలేక..
అలుపులేని కోర్కెలకు కళ్ళాలు వేయలేక..
ఏకాంత కుంత సంధ్యా కాంతల్లా నిలిచిన..
నీ ప్రేమఫలాల ఆక్రోశంలో..
నీ గుండె స్పందనను మరచిపోతుంది..
రెక్కలు రాని కూనలు..
హృదంతరాల సంతస కుసుమాలు కురిసే..
మంజుల మాసాలు మాకివ్వమని..
నీ వృధ్ధాప్యాన్ని ప్రశ్నిస్తే..
No comments:
Post a Comment