కుందేలుకు భలే గర్వం ..
తాను ముద్దుగా అందంగా వుంటాననీ..
మెరుపులా పరిగెడతాననీ..
తెలివితేటలూ ఎక్కువనీ..
అలానే తాబేలును చూస్తే విపరీతమైన చులకన..
అదొక మొద్దు స్వరూపం. .
పిరికి పందల్లో నంబర్వన్ ..
శత్రువనిపించాడా..
ప్రమాదమైపించిందా..
ఠక్కుమని..తన డొప్పలో తలా కాళ్ళూ లాగేసుకోవటం..
నక్కీ..నక్కీ..భయం లేదనిపించాక..బయటకురావటం..
అబ్బో..నడకలో చాలా ఫాస్టు..
దాని తాబేటి నడక యెంత ఫేమసో..
ఇక బుధ్ధి బలం సంగతి చెప్పేదేముందీ..??
యేం పందెం..? అంది తాబేలు నిదానంగా..
అదే పరుగు పందెం..
నీతో పరుగు పందెమా..?యేం..? యెగతాళా..?
అంది కోపంగా..
అబ్బే.. అలా అని కాదూ.. నీవు మరీ స్లో యేం కాదు.. అప్పుడప్పుడూ ఇలా పందేలూ అవీ వుంటుంటే.. నీ స్పీడూ పెరుగుతుంది.. చూసుకో మరి..
అంతే నంటావా..??
గేలి చేయట్లేదుగా..?
అస్సలులేదు..బొరుకొడుతూంది కదా.. యేంతసేపు ఈ అడవిలో ..యేడవటం ..
ఓ ఎంజాయ్ మెంటూలేదూ .. పాడూ లేదూ..అనీ..
ఏమంటావ్..??సరేనా..??
సరే అయితే..
కానీ నీవు మరీ ఫాస్టుగా పరిగెడతావేమో..??
లేదు .. లేదు.. నీ కోసం మెల్లిగానే వెళతాలే..
మరి ప్రైజ్ సంగతేంటీ..?
అవును కదూ..
ఆకులలములు తిని
బతికే వాళ్ళమే ఇద్దరం ..
చూద్దాంలే..మన పులి రాజు గారితో నీకు సన్మానం చేయిస్తా..
ఓకే..
ఓకే..
రేపు ఉదయం..
అందరినీ రమ్మంటానేం..
ఏమో బాబూ.. సరదాగానే ఉన్నా..గుబులుగా వుంది..
అలానే వుంటుందిలే అదో రకం ఎగ్జయిట్మెంటూ..వస్తా మరి....
సరే...
ఓ నక్క మామా..
ఓ నక్కమామా..
ఏం కుందేలు పిల్లడా..
పిలిచి మరీ ..మాట్లాడుతున్నావ్..??
ఏంటి సంగతీ..??
రేపు నువ్వో సారి అడవి రచ్చబండకు రావాలి..
అల్లనే నీ స్నేహితులు కూడా..
ఆ ..ఏంటి సంగతీ..?
మంచి కుందేలు పిల్లను పెళ్ళాడబోతున్నావా..?
అదేం లేదులే.. గమ్మత్తొకటి వుంది..
ఏంటది..?
చెప్తే కానీ రావా..మామా..?
విషయమేంటో తెలియాలిగా.. అల్లుడూ..
అయితే విను..
రేపు..గొప్ప పరుగు పందెం జరగబోతోంది..
దాన్ని అడవి అడవంతా.. తిలకించాలి..
పరుగు పందెమా..??
జింకలకూ.. కంగారూలకా..??
కాదు మామా నాకూ.. తాబేలుకూ..
జోకేస్తున్నావా..??
తాబేలుకూ.. నీకూ.. ఏంట్రా..?
మతుండే మాట్లాడుతున్నావా.. లేదా..?
అదే వింత మరి మామా..
తాబేలు తొడచరిచి మరీ చెప్పింది..
రేపు నన్నోడిస్తానని..
అంత ధైర్యమే .. దానికి..??
దాని సిగదరగా..ఇదేం విపరీతం..??
రేపొస్తావ్ గా..
వస్తా.. వస్తా..
ఇదిగో ఇది విన్నావా..??
ఏదో..??
తాబేలుకూ..కుందేలుకూ పరుగుపందెమట..
నెమలి నాట్యం..కోకిల గానం విన్నాం గానీ..
ఇదేంటమ్మోయ్..??
కొత్తగావుంది..
అదే మరి..రేపు రచ్చబండ దగ్గరట..
పులిరాజాగారూ వస్తున్నారుట..
అయితే వెళ్ళాల్సిందే కానీ..
ఎలానూ .. తాబేలు ఓడిపోతుంది..
ఇక మజా ఏం వుంటుంది నా బొంద..
తాబేలు చాలా ఆత్మ విశ్వాసంతో వుందట గెలుస్తానని..
ఏ దేవుడో మాయచేయాలి..
లేకపోతే పందెంలోని కుందేలు కుంటిదైనా కావాలి..
చూడాలంటే..
రేపు రచ్చబండ వెళ్ళాల్సిందే..
రాజా వారూ..
రాజా వారూ..
ఏంటన్నట్లు గుర్రుమన్నరు.. పులి రాజు గారు..
తమకొక సంగతి విన్నవిస్తాను..
విషయం చెప్పు ..విసిగించ వద్దు..గుర్..
అదేనండీ..
రేపు రచ్చబండ దగ్గర నేనూ.. తాబేలూ..పరుగు పందెం పెట్టుకోవాలని అనుకున్నాం ..
మీరు అధ్యక్షత వహిస్తే..
ఏమిటీ..
నీకూ.. తాబేలుకూ..పరుగు పందెమా..
మాతోనే పరాచికాలా....
ఫోవయ్యా..పుల్లయ్యా..దీనికి నేను అధ్యక్షత వహించాలా..
వేరేం పనేం లేదా.. నాకూ..
ఒక వైపు అవినీతి ప్రక్షాళన బిల్లు పెట్టండి మొర్రో..అని ఆ కొంగ .. ఒంటి కాలిపై నిలబడి..చేపలూ అవీ.. తినకుండా..పది రోజులబట్టీ..నిరాహార దీక్ష చేస్తూంది..
మిగతా జంతువులన్నీ దానికి మద్దతూ..
దిక్కు తోచక చస్తున్నా నేను..
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అవినీతి రేషన్ పంపిణీలో అవినీతి అంతెందుకూ.. నా కొడుకును..ఆ డ్రగ్స్ కేసు లోంచీ బయటకు లాగేసరికి నా తల ప్రాణం తోకకొచ్చిందనుకో..
అందుకే రాజావారూ.. అన్ని టెన్షన్సు మరపించేందుకు ఓ రిలాక్సేషన్ కావాలి కదా..??
పెద్ద వారూ..
పెద్ద మనసున్నవారూ..
తమరు కాదనరని కోటి ఆశలతో వచ్చాను..
అంతగా అడుగుతున్నావ్ గనక సరే..
థాంక్సండీ..
ఓకే.. ఓకే..
అలా .. అలా..
అడవంతా పాకిపోయింది..
రచ్చబండ కిక్కిరిసి పోయింది..
ఏదో ..చిన్న పందెం తమ ఇద్దరి మధ్యా.. అనుకుంది.. గానీ..
ఇంత హంగామా చేస్తుందా.. ఆ కుందేలు..
బాబోయ్..
పులిరాజా గారూ వచ్చారా.. నక్కలేంటి.. జింకలేంటి.. ఏనుగులేంటి..
ఒలంపిక్ అంత బిల్డప్ ఇచ్చిందనమాట ఈ కుంక..
హతవిధీ.. ఏం చేయను..??
బెంబేలెత్తిపోయింది తాబేలు..
ఇక తప్పక..
బరిలోకి దిగింది..
స్టార్ట్..అంది కాకి..
అందరూఉ ప్రోత్సాహంగా.. చప్పట్లు కొట్టడమేంటీ..??విజిల్సేంటీ..??
ఇంతలో మెరుపులా మాయమైది ఆ టక్కరి కుందేలు..
తానేమో మెల్లిగా నడవటం..
అందరూ వ్యంగ్యంగా తలో మాటా.. అంటూండటం ..
తను వింటూనే వుంది..
పులిరాజా గారికి చెప్పలేనంత అసహనంగా వుంది..
గెలిచినవారికి సన్మానమట.. శాలవా.. పూలమాల.. మెరుపు వీరుడు.. బిరుదు ప్రదానమట..
దాని మెడ పొడవు అటు తాబేలునూ ఇటు కుందేలునూ..చూడగలదు..
మైక్ దొరికిందే చాన్సని తిక్కవాగుడు వాగుతోంది..
కుందేలు గమ్యం చేరలేదట..కానీ..
మొదటి మజిలీ దగ్గర కాళ్ళూపుకుంటూ ..కూచుందట..
తన రాక కోసం చూస్తూ..
అబ్బ.. తనిలా ఫిక్స్ అయిందేమిటిరా.. బాబూ..
దారి పొడవూతా ప్రేక్షకులే..
ఉత్సాహవంతుల ఈలలూ.. కేకలూ.. చప్పట్లూ..
తుంటరి వెధవలు రాళ్ళూ .. గుందుసూదులూ..టమాటాలూ..విసురుతున్నారు..
అయ్యో...గుడ్లు కూడా..
అమ్మయ్య..
మొదటి మజిలీ వచ్చేసింది..
అదుగో .. కుందేలు గాడిద తననే చూస్తున్నాడు..
వచ్చావా.. బావా..అయితే మళ్ళీ నేను ఉస్కో..
నములుతున్న క్యారెట్ ను గాల్లో ఎగరేసి తృటిలో మాయమైంది..
ఒక్కసారి నిస్సత్తువ వచ్చేసింది..
ఎలానూ.. ఓడిపోతుంది..
తర్వాత రాజా వారి ఆగ్రహాన్ని.. అడవి జనాల చీత్కారాన్ని..చవి చూడాలి గామోసు..
ఏరా ..తాబేలు పీనుగా బుధ్ధుండే ఈ గేముకు సై అన్నావా..
నీవెంత ..?? నీ బతుకెంత..??
అయినా ఆకుందేలుతో పోటీ ఏవిట్రా నీకు..??
నిన్ను తగలెయ్య..
జీబ్రా మైక్ లో అరుస్తోంది..ఎంతైనా ప్రత్యేకమైన పోటీ..
తాబేలూ.. నిరుత్సాహ పడవద్దు..
అన్నిటికంటే మనో బలమే గొప్పది..
చిన్న ప్రాణి కూడా ఎంతైనా సాధించగలదు..
కమాన్.. హరియప్..
దీనికేం ఎన్నైనా చెప్తుంది..
ఇంత పొడవు కాళ్ళు.. మెడా వేసుకొని ..
కానీ ఆత్మ రక్షణకు రెండు కొమ్ములైనా లేవు దానికి..
ఏ పులో .. సిం హమో..
వెనక పడితే యేం చేస్తుందిట..??
చచ్చినట్లు .. చచ్చూరుకుంటుంది..
ఆ... యేమంటోంది.. రెండవ మజిలీలో .. కుందేలు తొంగుందట..
దీనికేం పొయ్యేకాలం..'
ఆ.. అమ్మాయ్యా.. రెండవ మజిలీ వచ్చేసింది..
అదుగో.. నిజంగానే గురకేస్తోంది..
కళ్ళు తెరిచిందా.. నేను ఫినిషే..
కుందేలును దాటి కూసంత దూరం నడిచింది..
వెనుదిరిగి చూసింది..
అబ్బే.. లేవలేదు..
జనాలూ సంభ్రమంగా చూస్తున్నారు..
వీళ్ళు లేపి చస్తారేమో..
ఏయ్.. కుందేలు.. లే..
కుందేలు కూనా లేవరా..తాబేలు వెళ్ళిపోతోంది..
ఓరోరోరి .. గుంటడోయ్..లే.. తొంగున్నావేటీ..??
పందెంలో పరాచికాలా..లేరా..
ఊహూ..
కుందేలు కునుకు పూర్తి కాలా..
రాజావారికి..మొదట అర్థం కాలా ..కానీ ఆయనా ఆశ్చర్యంగా..చూస్తున్నారు..
కుందేలేం చేస్తూంది..??
పక్కన సలహాదారులు ఏం చెప్పమంటారు రాజావారూ..ఆ బుధ్ధిలేని కుందేలు తాబేలును నీచంగా తనను గొప్పగా ఎస్టిమేషనేసుకుని .. ఆ చెట్టు కింద నిద్దరోతోంది..
వాట్ నాన్సెన్స్.. యువార్ టాకింగ్..
ఇంతమందిని పోగేసి..
పైగా నన్ను ఇన్వయిట్ చేసి.. ఇలా ఇక్క వేషాలేస్తుందా..??
వుండు దీని పని చెబుతా..
తాబేలు లక్ష్యాన్ని సమీపిస్తూంది..
జనాల కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి..
రాజావారు ఒకింత సానుభూతితో.. చూస్తున్నారు..తాబేలు విజయాన్ని..
అయిపోయింది..
తాబేలు గమ్యం చేరింది..
వగరుస్తూ నిలబడింది..
అక్కడ నెమలి అందంగా పూలమాలతో నిలబడివుంది..
తాబేలు మెడలో చటుక్కున మాల వేసింది..
జనాల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి..
ఉలిక్కి పడి లేచింది కుందేలు..
ఓ నిమిషం కునుకు పట్టేసింది..
ఏం జరిగిందీ..??
కళ్ళు విప్పార్చుకుని చూసింది..
చిరునవ్వుతో.. నిలబడివుంది..
అందరూ అభినందిస్తున్నారు..
కుందేలును ఎవ్వరూ పట్టించుకోలేదు ఇక..
తాబేలును రాజా వారి దగ్గరికి తీసుకు పోయారు..
రాజావారు షేక్ హేండిచ్చారు..
భుజం తట్టారు..
మెరుపు వీరుడు టైటిల్ ను భుజంపైనుంచీ అలంకరించారు.
ఆ పై..
రాజా వారు ప్రసంగించారు..
దేనికైనా..ఆత్మవిశ్వాసం ముఖ్యమనీ..
ఎప్పుడూ లక్ష్యం పట్ల నిర్లక్ష్యం కూడదనీ..అంటున్నారు..
నెమలికి నేర్పిన నడకలివీ..
అంటూ నెమలి నృత్యం చేసింది..
మౌనంగానే ఎదగమనీ..మొక్కనీకు చెబుతుందీ..
అని కోకిల గానాన్ని అందరూ ఆస్వాదించారు..
నక్క తోడేళ్ళ కుర్రాళ్ళు
బ్రేక్ డాన్స్ .. యహీహై షేక్ డాన్స్ అంటూ హుషారుగా చేసారు..
గోరింక మిమిక్రీ..ప్రత్యేక ఆకర్షణ..
ఆనాటి కార్యక్రమం చిలుక వందన సమర్పణతో ముగిసింది..
ఆనాటి కుందేలూ తాబేలు.. కథ ఈనాటికీ సజీవంగా నిలచి
ఎందరికో స్పూర్తి నిస్తుంది..
అందరూ బాగా ఆనందించారు..
ఇకపై అప్పుడప్పుడూ ఇలాంటి వినోద కార్యక్రమాలుంటే బాగుంటుందని అనుకున్నారు కూడా..
ఈ హడావుడిలో కుందేలు వెనుకనుంచీ జారుకోవటం ఎవ్వరూ గమనించనేలేదు..
No comments:
Post a Comment