చూడరా..ఇవ్వాళ కూడా అది కూర మాడ్చింది..
ఇక్కడ కూరకు వేసి..అక్కడ పెత్తనాలకు వెళుతుంది..
ఎక్కడికి వెళ్ళానూ..??
కిందికి కూరగాయలకేగా..
మీరు చూసుకుంటే అరిగిపోతారా..??
కూర మీరు మాత్రం మింగరా..??
చూడరా..చూడరా..
ఎన్ని మాటలంటూందో..కూరలకెళ్ళి కాత్యాయనితో గంటసేపు కాకమ్మ కబుర్లు చెప్పలేదూ..??
ఊహూ..సాయంత్రం గుడికని తగలడి..సుబ్బాయమ్మతో..సోది కబుర్లు చెప్పేది యెవరట..?
ఏమోనమ్మా..పెంపకం బాగుండాలి..
లేకపోతే పెద్దలపై గౌరవం పనిలో శ్రధ్ధా..అఘోరించినట్లే వుంటాయి..
మీ పెంపకం ఏమాత్రం ఏఢ్చింది కనక..??
మీ అమ్మాయి అల్లుణ్ణి తిండిపెట్టక చంపుతోంది..
అత్తగారిని ఆడపడుచు దగ్గరికి తరిమేసింది..
ఇంకా..
అమ్మో..అమ్మో..
నా కూతురిని అన్ని మాటలనడానికి నీకు నోరెలా వచ్చిందే..??
అది నీకేం అపకారం చేసింది..?
నిండా పదహారు నిండని పసికూనకు తొందరపడి పెళ్ళి చేసి ఆ రాక్షసుల దగ్గరికి పంపాను..
మీరు మాత్రం రాక్షసి కారూ..??
పొద్దున్నే లేచి నన్ను నలుచుకు తినటమే మీ పని..
పసికూనట.. పసికూన..
పసికూనే ఇంత చేస్తే ఇంక నెరజాణ అయి ఇంకెన్ని చేస్తుందో..??
రాఘవా..
రాఘవా..
ఇంక ఈ ఇంట్లో ఒక్క క్షణముండను..
రామానుజం దగ్గరికి నన్ను పంపించు..
అబ్బ.. ఈ ఇంట్లో సుఖ శాంతులనమాట..
సుఖపడవే..
సుఖపడు..
నీ కొడలూ నిన్ను నీలానే వేధిస్తే .. అప్పుడు తెలుస్తుంది..
శాపం పెడుతున్నారా..?
అయినా మీ శాపం తగలదు లెండి..
ఎందుకంటే మీరు మీ అత్తగారిని బాధపెట్టారేమో..?
అందుకే మీకు నేను తగిలాను..
అనవే .. అను..రాఘవా..రాఘవా..
ముసలితనంలో మొగుడిని పోగొట్టుకొని కోడళ్ళ పంచన చేరనే రాదమ్మా..
బాధ్యతలు తీరగానే వెళ్ళిపోవాలి..
ముక్కు చీదింది శాంతమ్మ..
రాఘవ అనే మానవ మాత్రుడు ఆ చాయలకు కూడా రాలేదు..
అత్తా కోడళ్ళ మధ్య సమిధలా కాలిపోతాననే భయం..
శాంతమ్మ రెండవ కోడలు దగ్గరికి ప్రయాణమైంది..
దిగబెట్టడమే కొడుకుల పని..
అక్కడా ఆమెకు చక్కని కోడలే వుంది.
అత్తగారు వెళ్ళిన వెంటనే..
రెండవ కోడలైన మహిమకు ఫోన్ చేసింది శ్యామల.
హలో..
హలో ఎవరూ..??
నేను శ్యామలని బాగున్నావా.. మహిమా..??
ఆ బావున్నాం..మీరూ బాగునారా.. అక్కా..??
నీకో గుడ్ న్యూస్..
గుడ్ న్యూసా అదేమిటబ్బా..??
అదేనమ్మా.. మన అత్తగారు ఇప్పుడే నీ దగ్గరికి బయలు దేరారు..
అయ్యబాబోయ్..అత్తగారా..??
నా సుఖం చూసి..ఎవరి కళ్ళు కుట్టాయో ..??
ఎవరి దిష్టి తగిలిందో..??
అక్కా.. ఇంతటి ఘోరమెలా జరిగింది..?
ఏముందె నేను కూర మాడ్చానట..
గొడవ పెట్టుకుంది.
నాకూ తిక్క రేగింది..
మొన్ననేగా.. నా దగ్గరినుంచీ అక్కడకొచ్చిందీ..
నాలుగు రోజులు పెట్టుకోకూడదా.. అక్కా..?
నేనేం చేయను చెప్పు ..?
వండింది తిని రామా కృష్ణా అని కూచుంటే ఎవరు మాత్రం పెట్టుకోరు..?
అదే కదా నా బాధ ఇక్కడి కొస్తే.. నేను చీరలు కట్టననీ..
మాక్సీలూ.. డ్రస్సులు వేస్తాననీ మొదలు పెడుతుంది..
మగరాయడిలా తిరుగుతాననీ సతాయిస్తుంది..
మన మొగుళ్ళూ తల్లికి తాళం వేస్తారుగా..మరి
అవును అదొక బాధ..
అరుణది ఇంకా ఘోరం..
ఏవిడ మాటలు విని శ్రీనివాస్ అరుణపై చేయి కూడా చేసుకుంటాడు..
అవునక్కా..
ఈ ముసలావిడ ఈ వయసులో ఇలా పేట్రేగి పోతూందెందుకో..?
కూతురు మాత్రం బాగుండాలి..
అక్కడ న్యాయం ఇంకోలా వుంటుందె మరి.
ఉష పసికూనట..
ఫోనులో బాంబంటే ఇదే నేమో..
వుంటానక్కా..
సరే అప్పుడప్పుడూ..ఫోన్ చేసూండు..
సరిగ్గా .. అప్పుడే..తలుపు తోసుకుని వచ్చారు రాఘవా..శాంతమ్మా..
వచ్చీ రావడం తోనే..ఫోన్ పట్టుకొని వున్న మహిమను చూసి విషయం గ్రహించింది శాంతమ్మ.
ఏమే అప్పుడే అది నీకు ఫోన్ చేసిందా..?
ఎవరత్తయ్యా.. ముఖం మాడిపోయింది మహిమకు.
ఇంకెవరూ.. నీ అక్క శ్యామల.
శ్యామలక్క కాదు..నా ఫ్రెండ్ ..
రండి బావగారూ..కూర్చోండి..
ఏమండీ..
బావగారూ అత్తయ్యా .. వచ్చారు.
ఏరా బాగున్నావా..?
బావున్నానన్నయ్యా..
ఏమ్మా వంట్లో బాగుందా..?
అప్పుడే వచ్చావేంటీ.. అనబోయి నాలిక్కర్చుకున్నాడు.
ఏం బాగులే నాయనా..
మిమ్మల్ని ఎలా కన్నానో..? ఎలా పెంచానో..?
ఈ కోడళ్ళు నా దుంప తెంచేస్తున్నారనుకో..
ఇంకా ఎన్నాళ్ళు పెట్టాడో ఈ కష్టాలు ..
నాయనా పరంధామా..
త్వరగా నన్ను నీ దగ్గరికి పిలిపించుకో తండ్రీ..
చేతులు పైకెత్తి గాల్లో భగవంతుణ్ణి ప్రార్థించింది శాంతమ్మ.
అలా అనకమ్మా .. అన్నాడు రాఘవ.
మీరంటే కొడుకులు..కోడళ్ళకేం పట్టింది నాయనా నా బాగోగులు..
నీ పధ్ధతి కాస్త మార్చుకుంటే..ఎక్కడైనా నీవు సుఖంగా వుండచ్చు.
అయినా నీకేం తక్కువ చేశామమ్మా..
మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్దాం ..గుండె దడగా వుంది అందిరా వెంటనే డాక్టరుకు చూపించాను..
వయసు పైబడటం వలన కానీ ఇంకే సమస్యా లేదన్నాడు.ఏవో మందులు ఇచ్చాడు..
ఇచ్చాడులేరా..
మీరు నా బంగారు తండ్రులు ..
రామ లక్ష్మణులు నాకు జన్మించారు.
రాఘవా..
నీవు కడుపున వుండగా శ్రీరామ జననం చేసానురా..
అందుకే నీకు రాఘవుడని పేరు పెట్టారు మీ నాన్న.
రామానుజం తల్లికి దగ్గరగా జరిగాడు అమ్మ తనను మర్చిపోయిందేమో నని ..
ఇదిగో వీడు పుట్టబోయే ముందు మీ నాన్నకు తిరుపతి వెంకన్న కలలో కనపడి నేను నీకు కుమారుడుగా జన్మించబోతున్నానూ..బాగా చూసుకో అని చెప్పాడుట..
అందుకే మీ నాన్న నన్ను వకుళా దేవీ.. వకుళాదేవీ..అని వేళాకోళం చేసేవారు..
బోసినోటితో నిండుగా నవ్వింది శాంతమ్మ ఓ కంటితో కోడల్ని గమనిస్తూ..
మహిమ చెవులప్పగించి వింటూ కూచుంది..
ఆ తల్లీ తనయుల ప్రేమానురాగాలకు మనసులో ఏదో అసూయలాంటి మంట..
ఇంతలో తరుణ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు..
తల్లి ఒడిలో దాక్కుని నానమ్మని చూసాడు..
వచ్చావా .. చిట్టి తండ్రీ..
రా.. నానమ్మ దగ్గరికి రారా..
చేతులు చాచింది శాంతమ్మ.
నేను రాను నాకు సున్నుండలూ .. జంతికలూ తెచ్చావా..?
లేదురా హడావుడిగా వచ్చాను .ఇక్కడ నీకు చేసి పెడతానుగా..రా..
వెంటనే అమ్మను వదలి నానమ్మ ఒడిలోకి ఎగబడ్డాడు..
చటుక్కున లేచి మహిమ లోపలికి వెళ్ళిపోయింది .
రా అన్నయ్యా భోంచేద్దాం..
ఏం వంటరా ఇవ్వాళ..?
చూడాలి ఏం వండిందో..మహిమా.. పిలిచాడు.. రామానుజం..
అన్నయ్యకు నాకు అన్నం వద్దించు..అమ్మా నీవూ కూచుంటావా..?
వుండర..రెండు చెంబుల నీళ్ళోసుకుని చిటికెలో వస్తా..
మహిమ మరి కాస్త బియ్యాన్ని కుక్కరులో పడేసింది..
మహిమా వాళ్ళ ఎదురు ఫ్లాట్ లోనే వుంటారు రుక్మిణీ సుకుమార్ లు
ఆవిడ అత్తా మామలు కూడా..వారితోనే వుంటారు.
వున్నది అత్తా కోడళ్ళైనా.. చీమ చిటుక్కుమనదు ఆ ఇంట్లోంచీ..
కోడలికి కష్టమని తెల్లవారే లేచి వండి పెట్టే అత్తగారూ..
అత్త గారి కాళ్ళ నొప్పులకు మసాజ్ చేసే కోడలూ..
కూతుళ్ళతో సమానంగా..కోడలికీ ప్రతి సంవత్సరమూ చీరలు కొనిస్తారా మామగారు.
ఏ మాత్రం తేడా రానీయక ఎక్కడికి వెళ్ళినా అత్తా కోడళ్ళు జంటగా వెళ్ళటం ఆ చుట్టు పక్కల వాళ్ళందరికీ ఆనందంగా వుంటుంది.
వచ్చిన నాలుగు రోజులకే శాంతమ్మ తన సహజ సుందరమైన స్వరంతో కోడలిపై ధ్వజ మెత్తటం ..
నాలుగు రోజులు వూరుకున్న కోడలు ఎదురు దాడికి దిగటం ..
చాలా మామూలుగా జరిగిపోయాయి..
రామానుజం అస్సలు నోరు తెరవటమే మానేసాడు.
కరవమంటే కప్పకు కోపం ..
విడవమంటే పాముకు కోపం..
ఏం చేస్తాడు మరి..?
రాత్రీ పగలూ లేకుండా..
కత్తులూ కటార్లూ లేకుండా..
మాటలే ఏటెలుగా.. చూపులే బాణాలుగా..
యుధ్ధం జరుగుతోంది..
పక్కనే రుక్మిణీ.. ఆమె అత్తగారు సీతమ్మ..నాలుగు రోజుల్లోనే పరిస్థితి అర్థం చేసుకున్నారు..
మధ్యాన్నం పూట కాలక్షేపానికని సీతమ్మ ఇంటికి దయచేసే శాంతమ్మ తన సుగుణాలను సీతమ్మకు అంటించాలని చూసింది.
ఎందుకు నీ కోడలికి అంత స్వతంత్రమివ్వటం ..?
కోడళ్ళను భయభక్తులలో వుంచుకోవాలి..
కొడుకులను చెప్పు చేతుల్లో వుంచుకోవాలి..
అప్పుడే మన పెద్దరికం నిలబడుతుందని బోధించేది.
అలా కాదు..
కోడలిని కూతురులా చూసుకోవాలి..
అంతకన్నా ఎక్కువగా ప్రేమించాలి..
అప్పుడే..మనమడగకుండానే..గౌరవమే కాదు భయభక్తులూ పాటిస్తారని చెప్పింది సీతమ్మ..
నీదంతా చాదస్తం అని కొట్టిపారేసింది శాంతమ్మ..
కానీ లోలోపల సీతమ్మలా వుంటే ప్రాణానికి హాయిగా వుంటుందేమో కదా.. అన్న విచారమూ కలిగింది..
సీతమ్మకూ తనకూ కాఫీ కలిపి తెచ్చింది రుక్మిణి.
మామగారికోసం ప్రత్యేకంగా కూరలు వండుతుంది..
సీతమ్మా తక్కువ తినలేదు..
రుక్మిణి చెల్లెలు అక్క దగ్గా నెల వుండడానికి వస్తే..
వూరంతా తిప్పి చూపించింది..
పట్టు పరికిణీ కుట్టించి పంపింది..
ఇంట్లో వున్నన్నాళ్ళూ రెండు పూటలా జడలేయటం..ఆ జడలకు పూలు సింగారించటం సీతమ్మకు సరదా..
ఓ రోజు పూల జడతో ఆ పిల్లను సింగారించి ఫోటో కూడా తీయించింది..
రుక్మిణీ అంతే..
ఆడపడుచు ఆమె భర్తా పిల్లలూ వచ్చినప్పుడు..తన కోడలిలా మూతి ముడవలేదు..
నవ్వుతూ జోకులేస్తూ..సరదాగా వుంది.
సెతమ్మా రామయ్యలతో సమానంగా సంతోషించింది..
ఎత్తిపొడుపులూ..
మూతివిరుపులూ లేని ఆ ఆనందకర వాతావరణం కలలోలా వుంది శాంతమ్మకు..
కొద్ది రోజుల తరువాత శాంతమ్మ కూతురు రమణి భర్తా పిల్లలతో వచ్చింది..
శాంతమ్మ వేధింపులతో బాగా కాక మీదున్న మహిమ వాళ్ళు నాలుగు రోజులలో పారిపోయేలా చేసింది..
శాంతమ్మ చాలా నిరాశ పడింది..పిల్లను నెల రోజులన్నా పెట్టుకోవాలన్న ఆశను కోడలు తుంచేసినందుకు మనసు బాగా గాయపడింది..
కంట తడి పెట్టుకుని ఆ పిల్ల వెళ్ళి పోయింది..
ఆ బాధ నంతా సీతమ్మ దగ్గర వెళ్ళ బోసుకుంది శాంతమ్మ.
చూశావా..
ప్రేమతో ప్రేమ లభిస్తుంది..
ద్వేషంతో ద్వేషమే..
నేవాపిల్లను మగరాయుడనీ.. అదనీ ..ఇదనీ..సాధించావ్..
దానికా పిల్ల ఈ విధంగా బదులిచ్చింది..
అదే నీవా పిల్లని ప్రేమగా చూసుకున్నట్లయితే ..నీ కూతురికి నాలుగురోజులు తల్లి దగ్గర ప్రశాంతంగా గడిపే అదృష్టం దొరికేది..
ఇదే కాదు..
రేపు నీకు జ్వరమొచ్చినా..తలనొచ్చినా..కోడలే పక్కన నిలిచేది అది గుర్తు పెట్టుకో శాంతమ్మా..అని బుధ్ధి చెప్పింది..
శాంతమ్మకు హటాత్తుగా జ్ఞానోదయమైనట్లనిపించింది.
సీతమ్మా నీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ఆధునిక ఋషులై సాక్షాత్కరించాలి..
నీవు సీతమ్మవు కావు నా పాలిటి జ్ఞాన దేవతవు అంది రెండు చేతులూ జోడిస్తూ..